తిరుపతి లో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన మరియు ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభమునకు విచేయుచున్న సీఎం.జగన్ మోహన్ రెడ్డి .

తిరుమల /తిరుపతి
మే మొదటి వారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన లో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు . మరియు…
- ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం
- ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు
- తిరుపతిలో పలు అభివృద్ధి పనులకు గౌ. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి మే మొదటి వారంలో శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి చెప్పారు. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అదనపు ఈవో, జెఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తిరుపతిలోని బర్ద్ ఆసుపత్రిలో చిన్న పిల్లల వార్డు ప్రారంభం, చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన, ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, ఆసుపత్రి అధికారులను సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరిగే టీటీడీ ప్రాంతాల్లో సుందరీకరణ, పారిశుధ్యం, విద్యుత్, ఉద్యాన విభాగం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అంతకుముందు అదనపు ఈవో శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమిపూజ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు .అనంతరం ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రిలో జరుగుతన్న పనులను, పలు విభాగాలను, ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, బర్ద్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, ఎస్వీ క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రమణన్‌తో పాటు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.